Latest News

Menu

ఇసుక కొరత గురుంచి తప్పక తెలుసుకోవాలసిన నిజాలు

ఇసుక వ్యవహారం ముదురుపాకాన పడింది. ఇసుక సక్రమంగా అందకపోవటంతో నిర్మాణ రంగం ఇరుకున పడింది. అనేకమంది నిర్మాణ కార్మికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వం ఇసుక సరఫరాల్లో చేసిన అక్రమాలు నిలువరించడానికె జగన్ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. కానీ ప్రకృతి సహకరించకపోవటం వల్ల మొత్తం వ్యవహారం ఇరకాటంలో పడింది. కార్మికుల ఆత్మహత్యలు కూడా ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాంతో ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేయడానికి కంకణం కట్టుకున్నాయి. ఇంత సమస్య రావడానికి కారణం జగన్ ప్రభుత్వమేనంటూ ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన మీడియా బాట పట్టాయి. దానికి  బీజెపి, వామపక్షాలు సైతం వంతపాడుతున్నాయి. సమస్య తీవ్రంగానే ఉంది.

దీనికి అసలు కారణాలు ఏమిటి?  ప్రభుత్వ వైఫల్యమా? ప్రభుత్వంలోని పెద్దల నిర్లక్ష్యం వల్ల సమస్య తీవ్ర రూపం దాల్చిందా? కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడడానికి ప్రభుత్వమే కారణమా? కార్మికుల ఆత్మహత్యలకి కూడా ప్రభుత్వ వైఫల్యమే కారణామా?

గత ప్రభుత్వ హయాంలో ఇసుక విక్రయాల్లో అవినీతి బాహాటంగానే ప్రవేశించి అదొక మాఫియాగా రూపాంతరం చెందింది. దీన్నుంచి నిర్మాణ రంగాన్ని కాపాడటానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణ చర్యలు సత్ఫలితాలను ఇవ్వక, అదొక తీవ్ర సమస్యగ మారి చివరకు ప్రభుత్వానికి ఒక రాజకీయ సమస్యగా మారిందా? ఇసుక విక్రయాల్లో అక్రమాలను అదుపుచేసి ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నానికి ప్రకృతి సహకరించకపోవటం వల్ల ఇంతటి సమస్య తలెత్తిందా? ఊహించని విధంగా గడచిన మూడు నెలల్లో ప్రధాన నదుల్లో వరదలు రావటం వల్ల ఇసుక లభించని పరిస్థితి తలెత్తింది. దాంతో ప్రభుత్వం ఈ రాజకీయ తుఫానులో చిక్కుకుంది.
చిత్తశుద్ధి, నిజాయితీతో ప్రజలకు మేలు చేయాలనే ప్రయత్నం ఓవైపు అధికారులు, మంత్రుల నిర్లిప్తిత మరోవైపు ప్రకృతి సహకరించకపోవడం కలిసి చివరకు రాజకీయ సమస్యగా మారాయి. ఈ ఇసుక తుఫాను సుడిగుండంలో ప్రభుత్వం ఇరుక్కుంటుందా? లేక సద్దుమణుగుతుందా?.

గత ప్రభుత్వంలోనే అక్రమాలు
గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఇసుక విక్రయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నాయకులు ఇసుక వ్యాపారులుగా అవతరించారు.  చాలామంది నాయకులు అక్రమ సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చారు. ధరలు ఆకాశాన్ని అంటాయి. టన్ను ఇసుక వేల రూపాయల ధర పలికింది. అప్పట్లో ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా విక్రయాలు, ఉచితంగా ఇసుక అంటూ విధానాలు ప్రకటించినప్పటికీ ప్రజలకు అందింది మాత్రం శూన్యం. టీడీపీ నేతలు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు.

దీన్ని నిలువరించాలన్న సదుద్దేశంతో వైసీపీ అధికారంలోకి రాగానే ఇసుక విక్రయాలను పూర్తిగా నిషేదించింది. తక్కువ ధరకు ఇసుక లభించే విధంగా, నాయకులు, అధికారుల ప్రమేయం పరిమితం చేసి కొత్త విధానం అమలులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆలోచించారు. ఇసుక రీచ్ల నుంచి క్రయ విక్రయాలు నిలిపివేశారు. దీనికి ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించాలని నిర్ణయించారు. అయితే అందులో జాప్యం జరగడం, నదులకు వరదలు రావడం వల్ల ఇసుక లభించని పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త ఇసుక పాలసీ అంటూ జాప్యం. ముందుగా సెప్టెంబర్ నుంచి కొత్త పాలసీ అని తర్వాత అక్టోబర్కు మార్చడంతో ఇసుక రీచ్లు కాళీగా ఉన్న సమయంలో పాలసీ రెడీగా లేదని తవ్వకాలకు నో చెప్పిన సర్కార్ తీరా పాలసీ రెడీ అయ్యే సరికి నదుల్లో పెరిగిన ప్రవాహాలు, వరదలు. వరదలు తగ్గుముఖం పడితే ప్రభుత్వం ఇసుక తీయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది.

80 శాతం రీచులు నీటి అడుగునే..
మొత్తం 267 ఇసుక రీచులలో దాదాపు 80 శాతం అంటే 207  రీచులు భారీ వరదల కారణంగా నీటిలో మునిగిపోయాయి. ఇప్పుడు ఇసుక లభించేది కేవలం 60 రీచుల నుండి మాత్రమే. గడిచిన 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కృష్ణా నదిలో 70 రోజులుగా, గోదావరిలో 40 రోజులుగా భారీ వరద కొనసాగుతుంది.  వాగులు, వంకలు నదులు ఉప్పొంగి 4200 TMC ల నీళ్లు సముద్రంలో కలిసాయి. గత ప్రభుత్వ హయాంలో కరువు, వానలు తక్కువ బట్టి ఇసుక ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేది.
జగన్ ప్రభుత్వ నియంత్రణ చర్యలు

ఇసుక అక్రమంగా రవాణా చేయడంపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. కొత్త పాలసీ ద్వారా ఇసుకను పారదర్శకంగా అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని పక్కదారి పట్టించేందుకు కొందరు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. బల్క్ బుకింగ్ లలో పలువురు బ్రోకర్లు ఆన్లైన్ లో  వేర్వేరు అడ్రస్ లతో ఇసును బుక్ చేస్తూ.. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా నకిలీ ఐడిలతో ఇసుకను బుక్ చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిపై పోలీస్, మైనింగ్ అధికారులు జరిపిన విచారణలో గుంటూరు కేంద్రంగా కిషోర్ అనే వ్యక్తి ఆన్లైన్ లో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడయ్యింది. సుమారు 1.27 లక్షల రూపాయల విలువైన ఇసుకను కిషోర్ నకిలీ ఐడిలతో బుక్ చేసినట్లు గుర్తించారు. కిషోర్ అక్రమంగా తరలించేందుకు సిద్దం చేసిన 27 టన్నుల ఇసుకను, 7 ట్రాక్టర్ లను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. అలాగే గన్నవరంకు చెందిన దుర్గారావు అనే వ్యక్తిని కూడా గుర్తించారు. బినామీ పేర్లతో 3.80 లక్షల రూపాయల విలువైన ఇసుకను దుర్గారావు ఆన్లైన్ లో బుక్ చేశారు. మీసేవ ఆపరేటర్ గా పనిచేస్తున్న దుర్గారావు బ్రోకర్లతో కుమ్మకై ఈ మేరకు మోసానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. దీనిపై కిషోర్, దుర్గారావులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆన్లైన్ ద్వారా వస్తున్న దరఖాస్తులకు సంబంధించి ఐపిలను గుర్తించడం ద్వారా ఇటువంటి మోసాలకు చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సమస్య వల్ల భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గనుల శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. కృష్ణా , గోదావరి నదుల్లో వరద కొనసాగుతోందని, దీనివల్ల ప్రధానమైన రీచ్ ల నుంచి ఇసుకను అందించలేక పోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత ప్రారంభంలో అయిదు వేల టన్నుల ఇసుకను అందించగా, నేడు దానిని నలబై అయిదు వేల టన్నుల మేరకు పెంచగలిగామని తెలిపారు. గత పదేళ్లలోని వర్షాభావ పరిస్థితులకు భిన్నంగా ఈ ఏడాది సంవృద్దిగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దీనివల్ల కృష్ణానదిలో డెబ్బై రోజులుగా, గోదావరిలో నలబై రోజులుగా వరద కొనసాగుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇసుక కొరత ఉత్పన్నమైందని, దీనిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇసుక రీచ్లను గుర్తిస్తున్నామని అన్నారు.

కావలసినంత ఇసుక వుంది:
వరదల కారణంగా దాదాపు పది కోట్ల టన్నుల ఇసుక నదుల్లో మేట వేసిందని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక మాత్రమే వినియోగిస్తున్నారని అన్నారు. అంటే సమృద్ధిగా మరో అయిదేళ్లకు సరిపడ్డ ఇసుక నిల్వలు రాష్ట్రంలో వున్నాయని తెలిపారు. ఇప్పటికే 1295 మంది బల్క్ కన్స్యూమర్ లకు అయిదు లక్షల టన్నుల ఇసుకను అందించామని తెలిపారు. మరో పదిహేను రోజుల్లో వరదలు కూడా తగ్గుముఖం పడతాయని భావిస్తున్నామని, ఇసుక రీచ్ ల నుంచి వరదనీరు తగ్గగానే కావాల్సినంత ఇసుకను వినియోగదారులకు అందచేస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు 1.70 లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేయడం జరిగిందని వెల్లడించారు. ఇసుక కోసం sand.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు.

Share This:

Post Tags:

RAYARAO SRIRAM

I'm Rayarao Sriram. I am a Movie Buff and working as Freelance Feature Writer and Film Review. I love to stay honest and unique. I love Cinema and I respect Film Makers. Follow me to get updates on the latest happenings in film industry and for the latest and genuine faster updates!

No Comment to " ఇసుక కొరత గురుంచి తప్పక తెలుసుకోవాలసిన నిజాలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM