Latest News

Menu

Interview Of Prem Kumar Patra(Aa Naluguru Producer)

సమాజం అంటే ఆయనకి ప్ర్రాణం. ఆ సమాజనికి ఏదో చేయాలి, ఏదో చెప్పాలి అనే తపన. ఆ తపనే అతన్ని చేస్తున్న ఉద్యోగాన్ని కూడా కాదనుకొని సినిమాల వైపు నడిపింది. ఆయన నిర్మించిన సినిమాలు చాలా తక్కువ అయినా ఆయనది పరిచయం అవసరం లేని పేరు. “ప్రేం కుమార్ పట్రా” అంటే తెలియని తెలుగు వారు ఉండరు అని చెప్పడం లో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. “ఆ నలుగురు” అనే చిత్రం ద్వారా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి ఆ తరువాత “వినాయకుడు” అనే చిత్రం ద్వారా ప్రేక్షకులకు మంచి సినిమా ఎలా ఉండాలో రుచి చూపించి వరసగా రెండు సార్లు నందులను కైవసం చేసుకున్న నిర్మాత ప్రేం కుమార్. “ఆ నలుగురు” నుండి “ఆ ఐదుగురు” వరకు ఆయన ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు.

ఇంటర్వ్యూ బై “రాయారావ్ శ్రీరామ్”

శ్రీరామ్ : మంచి కుటుంబ నేపథ్యం ఉన్న మీకు సినిమాల మీద మక్కువ ఎలా కలిగింది? సినిమాలు తీయాలి అన్న కోరిక వెనుక ఉన్న కారణం ఏంటి?
ప్రేం కుమార్ : సమాజానికి ఏదో చేయాలి అనే తపన తో నే సినిమాలు తీయడం మొదలు పెట్టాను.నేను పరిసరాలని ఎక్కువ గమనిస్తూ ఉంటాను. మా నాన్న గారు ఉపాధ్యాయుడు. ఆయన నుండి నేను చాలా నేర్చుకున్నాను. నా ఏడవ తరగతి లో నాటకాలు వేయడం మొదలు పెట్టాను. ఆ నాటకాల వ్యాపకం కూడా చిత్ర నిర్మాణం వైపు అడుగులు వేసేందుకు తోడ్పడింది. ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలు తిరిగి 2000 లో హైదరాబాద్ కి వచ్చి అప్పుడు ఏదైనా సమాజానికి పనికొచ్చే మంచి సినిమా చేయాలి అనే ఉద్దేశ్యంతో ఈ ప్రయాణం మొదలు పెట్టాను. అది ఇలా కొనసాగుతుంది.
శ్రీరామ్ : మీరు ఈ మధ్య నిర్మించిన చిత్రం “ఆ ఐదుగురు” ఫలితం మీకు ఎలా అనిపించింది?
ప్రేం కుమార్ : ఆ ఐదుగురు మంచి సబ్జెక్టు. నా మొదటి చిత్రం ఆ నలుగురు చిన్న సినిమా. ఆ సినిమా విడుదల అయిన మూడో వారం వరకు పెద్దగా ఎవరికీ తెలీదు. మూడో వారం నుండి జనాలు థియేటర్లకి రావడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆ చిత్రం సాధించిన విజయం అందరికీ తెలిసిందే. ఆ ఐదుగురు చిత్రం కూడా అంతే ఉండింది. కాకపోతే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు వేరు. ఇప్పుడు అంత సమయం లేదు చిన్న సినిమాలకి. ఎక్కువ రోజులు ఆడడం లేదు. థియేటర్లకి అద్దె కడితే కానీ ఆడించే పరిస్థితి లేదు. కొంచెం సమయం ఉండి ఉంటే కచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళేది.
అందుకని అది నాకు ఒక తీరని ఆశ గా మిగిలిపోయింది. రెండున్నర సంవత్సరాలు పాటు మేమంతా సమాజానికి ఏదో చేయాలనే తపన తో చేసాము. కానీ దానికి పెద్దగా ఆదరణ రాలేదు. ఇక అటువంటి చిత్రాలు తీయకూడదు అని చెంపలేసుకున్నాను. తీసినా ఆ చిత్రాలు ఆదరించరు అని అర్ధం అయిపొయింది. ఇక సినిమాలు తీయడం అంటూ జరిగితే రొటీన్ చిత్రాలు, అడల్ట్ కామెడీ చిత్రాలు తీయాలనే ఆలోచన వస్తుంది. సమాజం అందరూ నడిచే దారిలో నే మనము నడవాలి. డబ్బు కోసమే సినిమా తీయాలి అనే ఆలోచన వస్తుంది. కానీ నా మనసు ఒప్పుకోకపోవచ్చు.
శ్రీరామ్ : “ఆ ఐదుగురు” చిత్రాన్ని ఇంకా బాగా తీసి ఉండొచ్చు అని అనిపించిందా?
ప్రేం కుమార్ : అవును బాగా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. మేము సమాజానికి మార్పు తీసుకొచ్చే  సినిమా అని ముందు నుండి ప్రచారం చేసాము. కానీ అది కాకుండా ఇంకా యువత కు నచ్చే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి అని చెప్పి ఉంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమా కొంచెం సీరియస్ నెస్ ఎక్కువ ఉంటుంది అయినా కొన్ని సినిమాలు బాగానే చూస్తారు కానీ మరెందుకో ఈ చిత్రం యువత కు ఎక్కలేదు. పైగా  కొత్త ముఖాల వల్ల జనాలు పెద్ద గా రిసీవ్ చేసుకోలేక పోయారేమో! అన్న భావన కలిగింది.
శ్రీరామ్ : మీ మునుపటి చిత్రాల లాగా తదుపరి చిత్రాల లో కూడా కొత్త వారికి అవకాశం ఇస్తారా?
ప్రేం కుమార్ : తప్పకుండా! ఇక ముందు నిర్మించబోయే చిత్రాల లో కూడా కొత్త వారిని తప్పకుండా ప్రోత్సహిస్తుంటాను. కానీ ఈ సారి మాత్రం ఒక మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు ఆదరించారు అనే అభిప్రాయం కలిగింది. నా పంథా ను మార్చుకోవాలి అనే ధృఢ నిశ్చయం తో ఉన్నాను. కానీ మంచి చిత్రం తీయడానికి మాత్రం వెనుకాడను.
శ్రీరామ్ : ఈ రోజుల్లో ఒక సినిమా కి సంబంధించి నిర్మాత పాత్ర ఎలా ఉంది?
ప్రేం కుమార్ : నిర్మాత ఈ రోజుల్లో ఒక క్యాషియర్ లాగా మారిపోయాడు. సినిమాలో ఎవరిని తీసుకోవాలి అన్న విషయాలు హీరో నే నిర్ణయం తీసుకుంటున్నాడు. నిర్మాత కు ఆ స్వేఛ్చ లేదు. నిర్మాత కేవలం చేతులు కట్టుకోని నిలబడే పరిస్థితి వచ్చింది.
శ్రీరామ్ : సినిమా మేకింగ్ లో మీరు గమనించిన తేడాలు ఏమైనా ఉన్నాయా?
ప్రేం కుమార్ : ఒకప్పుడు “ప్రేం నగర్” చిత్రాన్ని ఐదు లక్షల్లో తీసారంటే నాకు ఇంకా ఆశ్చర్యం గా నే ఉంది. ఈ రోజు, రోజుకి ఇదు లక్షలు అవుతుంది. డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలనే ఉద్దేశ్యం తో ఉన్నారు అందరూ. చిన్న సినిమాలు బెటర్ అనే విషయం అర్ధం అయింది. పెద్ద సినిమాలు మూడు ముక్కలాట, తగిలితే జాక్పాట్ లేకుంటే ఫట్. చిన్న చిత్రాలు అయితే పదమూడు ముక్కలాట, కొంచెం సేపు అయినా ఆడొచ్చు.
శ్రీరామ్ : ఈ మధ్య కాలం లో అవకాశాలిస్తాం అని పిలుస్తున్నారు, అన్నీ అయ్యాక “అవాకాశం ఇస్తాము కానీ ఎదురు మాకెంతిస్తారు?” అని అడుగుతున్నారు కొందరు నిర్మాతలు. మీరు అటువంటివి ఏమైనా చూసారా?
ప్రేం కుమార్ : కొత్త కెమెరాలు అని చెప్పి వాటితో చాలా మంది సినిమాలు చేస్తున్నారు. అలా కొత్త వాళ్లకి అవకాశం ఇస్తాం అంటున్నారు. వీళ్ళు డబ్బులు అప్పు చేసి ఇస్తున్నారు. ఆ సినిమాలు విడుదల అవ్వవు, పేరు రావు. ఈ మధ్యలో ఇలాంటివాళ్ళు చాలా మంది తయారయ్యారు. కొత్త వాళ్ళు కూడా ఎక్కువ నిలదొక్కుకోవడం లేదు. ఇలా చేయడం సమంజసం కాదు.
శ్రీరామ్ : ప్రస్తుతం వస్తున్న “ఫార్ములా బేస్డ్ చిత్రాలపై” మీ కామెంట్?
ప్రేం కుమార్ : ఈ మధ్య అంతా ఒకటే పంథా ఫాలో అవుతున్నారు. ఒక కామెడీ ఉంటే చాలు అని, లేదంటే హీరోయిన్ ఉంటే చాలు, హీరోయిన్ ని బాగా చూపిస్తే చాలు సినిమాలు ఆడతాయి అనుకుంటున్నారు. మంచి కథలు రావడం లేదు. ఒకళ్ళు ఏది అనుసరిస్తే దాన్నే మిగిలిన వాళ్ళు ఆచరిస్తున్నారు కానీ వాళ్లకి వర్క్ అయింది మనకి ఎంత వరకు అవుతుంది అన్న విషయం ఎవరు ఆలోచించడం లేదు, ఆ విషయమే ఆలోచిస్తే చాలా మంచి చిత్రాలు చేసే అవకాశం ఉంటుంది. బ్రహ్మానందం లాంటి వాళ్ళని తీసుకొని కామెడీ చేయిస్తున్నారు కానీ అది ఎంత వరకు పండుతుంది అనేది చూడడం లేదు. ఆయన పేరు మీద సినిమా నడుస్తుంది అన్న ఆలోచన లో ఉన్నారు. కథ కు ఎంత వరకు అవసరం అని ఆలోచించడం లేదు. అందువల్ల సక్సెస్ రేట్ కూడా తగ్గిపోతుంది.
శ్రీరామ్ : ఇటీవలే విడుదల అయిన దృశ్యం లాంటి చిత్రాలు తక్కువ ఖర్చు తో తీసారు, ఎక్కువ డబ్బులు వచ్చాయి. మీకు అటువంటి చిత్రాలు నిర్మించే ఆలోచన ఏమైనా ఉందా?
ప్రేం కుమార్ : అలాంటి చిత్రాలు తీసే ఉద్దేశ్యం లో నే ఉన్నాను. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. కుటుంభ కథా చిత్రాలు అంటే అన్ని అంశాలు ఉండే లాగా మీరన్నట్టు దృశ్యం లాంటి చిత్రాలు తీస్తాను. అటువంటి చిత్రాలు రావడం కూడా చాలా అవసరం.
శ్రీరామ్ : ఈ మధ్య అనేక మంది లఘు చిత్రాలు(షార్ట్ ఫిల్మ్స్) గురించి మాట్లాడుతున్నారు. షార్ట్ ఫిల్మ్స్ చేసి హీరోలు, దర్శకులు అయిన వాళ్ళు ఉన్నారు పరిశ్రమ లో. ఇలా షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళ గురించి మీ అభిప్రాయం?
ప్రేం కుమార్ : వాళ్ళ గురించి మంచి విషయాలు విన్నాను. మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ చాలా వస్తున్నాయి. “షార్ట్ ఫిల్మ్స్ క్లబ్” అని ఒకటి స్థాపించి వీరందరినీ ఒక చోట చేర్చి ప్రోత్సహించాలి అనే ఉద్దేశ్యం ఉంది. త్వరలో దానికి కార్య రూపం ఇస్తాను.
శ్రీరామ్ : మీ ప్రతి చిత్రం లో ఏదో ఒక చిన్న పాత్ర అయినా పోషిస్తుంటారు. అది ఏమైనా సెంటిమెంట్లా భావిస్తున్నారా?
ప్రేం కుమార్ : అదేం లేదు. చిన్నప్పటి నుండి నటన మీద ఆసక్తి ఉంది. నాటకాలు వేసేవాడిని. అలా నా చిత్రలో ఏదో ఒక పాత్ర ను పోషిస్తుంటాను. డిసెంబర్ నుండి ఇక ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అందుబాటులో ఉందాం అని నిర్ణయించుకున్నాను. కొత్త సంవత్సరం లో మీరు నన్ను చాలా చిత్రాల్లో నటుడిగా చూడొచ్చు.
శ్రీరామ్ : నటుడు, నిర్మాత. ఈ రెండిటిలో మీకు ఏ పాత్ర అంటే ఇష్టం?
ప్రేం కుమార్ : నిర్మాత అంటే టీ, కాఫీల నుండి ప్రతి చిన్న విషయం దగ్గరుండి చూసుకోవాలి అదే నటుడు అయితే అన్ని వేరే వాళ్ళు చూసుకుంటారు. నటన మీద ఎకాగ్రత పెట్టొచ్చు. కాబట్ట్టి నటుడు పాత్ర పోషించడమే సులభం!
శ్రీరామ్ : నిర్మాత గా మీరు ఏ మేరకు సంతృప్తి చెందుతారు?
ప్రేం కుమార్ : నిర్మాత గా సంతృప్తి చెందాను. ఆ నలుగురు ప్రేం కుమార్ అంటే అందరూ గుర్తు పడతారు. అతి తక్కువ మందికి అటువంటి సంతృప్తి దొరుకుతుంది, ఆ చిత్రానికి బంగారు నంది వచ్చింది. ఆస్కార్ స్క్రీనింగ్ జరిగింది. జాతీయ పురస్కారాలకి కూడా పంపడం జరిగింది. ఈ మధ్య “ది గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీస్” అనే పుస్తకం ప్రచురించారు, a పుస్తకం లో నా గురించి, ఆ నలుగురు చిత్రం గురించి రాయడం జరిగింది.
శ్రీరామ్ : ప్రేం కుమార్ అంటే ఆ నలుగురు చిత్రం తీసారు అని చెప్పుకుంటారు. భవిష్యత్తు లో కూడా మీ నుండి అటువంటి చిత్రాలు ఆశించొచ్చా?
ప్రేం కుమార్ : అటువంటివి తప్పకుండా తీస్తాను. కాని మంచి సినిమాలు సమాజం కు ఉపయోగపడే చిత్రాలు చేయాలని ఉంది కాని ఆదరిస్తారో లేదో అన్న భయం ఉంది. ఆ విషయం మీద చాలా బాధ గా ఉంది. డిసెంబర్ నుండి నా ఉద్యోగానికి శాశ్వతం గా స్వస్తి పలికి పూర్తి స్థాయి లో నటుడి గా నిర్మాత గా నా సినీ ప్రయాణాన్ని సాగిస్తాను. మంచి చిత్రాలు తీస్తాను.
శ్రీరామ్ : చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా?
ప్రేం కుమార్ : సినిమా ని ప్రేమించే వాళ్ళు అందరూ మంచి చిత్రాన్ని తప్పకుండా ఆదరించాలని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు!
ఇంటర్వ్యూ బై “రాయారావ్ శ్రీరామ్”

Share This:

Post Tags:

RAYARAO SRIRAM

I'm Rayarao Sriram. I am a Movie Buff and working as Freelance Feature Writer and Film Review. I love to stay honest and unique. I love Cinema and I respect Film Makers. Follow me to get updates on the latest happenings in film industry and for the latest and genuine faster updates!

No Comment to " Interview Of Prem Kumar Patra(Aa Naluguru Producer) "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM